Who is Farmer?

రైతు అంటే ఎవరు?

2007 జాతీయ రైతు కమిషన్ ఇచ్చిన నిర్వచనం: “రైతు అంటే పంటలను సాగుచేసే, ఇతర ప్రాథమిక వ్యవసాయ సరుకులను ఉత్పత్తి చేసే ఆర్ధిక, జీవనోపాధి కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనే వ్యక్తి. వ్యవసాయ భూములు కలిగిన వారు, సాగుదారులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, పాలుకు చేసేవారు, కోళ్ళు, పశువులు, జీవాలను పెంచే వాళ్ళు, మత్స్యకారులు, తేనెటీగలను పెంచే వారు, తోటలను పెంచే వారు, సంచార పశు పెంపక దారులు, కార్పొరేటేతర తోటల పెంపక దారులు, తోటలను పెంచే కూలీలు, వారితో పాటు వ్యవసాయానికి అనుబంధంగా సాగే పట్టుపురుగుల పెంపకం, వానపాముల పెంపకం వంటివి చేసేవారు ఈ నిర్వచనం క్రిందకు వస్తారు. పోడు వ్యవసాయంసాగించే, చిన్న తరహా కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించి, ఉపయోగించి, అమ్మే ఆదివాసీ కుటుంబాలు, వ్యక్తులు కూడా ఈ పదం అర్ధంలోకి వస్తారు. ”

మనం బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు
పై నిర్వచనం చూస్తే, కేవలం భూమి ఉన్నవారే రైతులు అనుకోకూడదు. వ్యవసాయం, దాని అనుబంధిత రంగాలపై ఆధారపడి బతుకుతున్న వారందరూ రైతులే. అంటే రైతుల కోసం ప్రభుత్వం అందించే సహకారాలు వీరందరికీ అందాలి. వారి పక్షాన మనం కృషి చెయ్యాలి.

భూమి పట్టా లేని వాస్తవ సాగుదారుల సమస్యలు ముఖ్యం: వాస్తవంగా సాగు చేస్తూ, ఆ సీజన్లో పంట వెయ్యడం కోసం ఖర్చులు చేసి, పెట్టుబడి పెట్టి, కుటుంబమంతా శ్రమ పడుతున్న వారు ఎవరైనా వారే వాస్తవ సాగుదారు. ఆ పంటకు సంబంధించిన సబ్సిడీలు, పంట రుణాలు, పంట బీమా, నష్టపరిహారం, మార్కెట్లో సరైన ధరలు – ఇవన్నీ వీరి హక్కు. అయితే వారు పట్టాదారు కాకపొతే వారికి ఇవేవీ లభించట్లేదు. వీరు కౌలుకి తీసుకున్న వారు కావచ్చు, పాలుకి తీసుకున్న వారు, మహిళా రైతులు, అసైన్డ్ భూములు (డి-ఫారం భూములు) సాగు చేస్తున్నవారు కావచ్చు. వీరి సమస్యల పరిష్కారానికి మనం ప్రధానంగా కృషి చెయ్యాలి.

మహిళలను రైతులను గుర్తిద్దాం: వ్యవసాయంలో 70 శాతం పని చేస్తున్నది మహిళలే. అయితే వారిని రైతు భార్యగా, కూతురుగా లేదా తల్లిగా మాత్రమే ప్రభుత్వం కాని, సమాజం కాని, మనం కాని చూస్తున్నాం. ఇది తప్పక మారాలి. వ్యవసాయంలో పని చేస్తున్న మహిళలందరినీ “రైతులు” గా గుర్తిద్దాం. ప్రభుత్వ పథకాలలో కూడా గుర్తించేలా కృషి చేద్దాం. ముఖ్యంగా భూమి రికార్డులలో వారి పేర్లు కూడా ఉండాలి. భర్త చనిపోతే ఆయన సాగు చేస్తున్న భూమి అతని అన్నదమ్ములకు కాకుండా ఆమెకు సంక్రమించాలి. బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, పథకాలు ఇవన్నీ కేవలం మగ రైతులను ఉద్దేశించి కాక వాటిలో మహిళా రైతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, మార్కెట్ యార్డులలో కూడా వారికి సదుపాయాలు కల్పించాలి.